10. Disney World/Disney Sea:





Disney World చిన్న పిల్లలకోసం అయితే Disney Sea పెద్దవాళ్ళకోసం. ఈ రెండు ప్రక్కప్రక్కనే ఉంటాయి. రెండిటి రైడ్స్ లో తేడా ఉంటుంది. టోక్యో డిస్నీ రిసార్ట్ (రెండూ కలిపి) వాల్ట్ డిస్నీ కి చెందని ఎకైక డిస్నీ రిసార్ట్. అంటే ఇక్కడి ఒక కంపెని డిస్నీ వారి దగ్గర థీం కొనుక్కున్నారు. మేము Disney Sea కు వెళ్ళాము. ఇక్కడి రైడ్స్ బాగున్నాయి, కాని యూనివర్సల్ స్టూడియో తో పోలిస్తే చిన్నవే. అన్ని రైడ్స్ కి వెళ్ళడానికి ఒకరోజు మొత్తం పడుతుంది. కొన్ని రైడ్స్ ముందు "ఈ రైడ్ కష్టంగా ఉంటుంది" అని చాలా హెచ్చరికలు రాసి ఉంటాయి. కాని అంత భయపడేట్టుగా ఏమీ ఉండవు. అన్ని రైడ్స్ లో Tower of Terror(Scary free fall)చాలా బాగుంటుంది. సాయంత్రం 'అగ్ని', 'నీరు' ప్రేమించి పెళ్ళి చేసుకోవడమనే దృశ్యరూపకం చాలా బాగుంటుంది.

11. యొకొహమ:


(yokohama sky tower నుండి నా స్నేహితుడు తీసిన ఫోటో, క్లిక్ చేస్తే పూర్తి చిత్రాన్ని చూడవచ్చు.)

యొకొహమ టోక్యో కి దగ్గర్లో ఉండే అతి పెద్ద నగరం. యొకొహమ లో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ’మినతొమిరయి’ లో చాలా పెద్ద పెద్ద భవనాలను చూడవచ్చు. అక్కడి ’Landmark tower' జపాన్ లోనే అతిపెద్ద భవనం. 69వ అంతస్తులో observatory ఉంది. దానికి ఎదురుగానే పెద్ద Ferrous wheel ఉంటుంది (ఇది ప్రపంచంలో పెద్దది). yokohama sky walk అనే ప్రదేశం నుండి ఈ భవనాల view బాగుంటుంది.
యొకొహమ లో పెద్ద చైనాటౌన్ కూడా ఉంది. యొకొహమ పోర్ట్, డాల్ మ్యూజియం, యమషితా పార్క్ లు చూడ దగ్గ ప్రదేశాలు.

12. ఓడైబ:



సరదాగా ఒక రోజు గడపడానికి ఈ ప్రదేశం బాగుంటుంది. ఇక్కడ మ్యూజియం లు, షాపింగ్ కాంప్లెక్స్ లు ఉంటాయి. ఇక్కడి ప్రదేశాలన్నిటిని కలుపుతూ ’యురికమమొ’ రైల్వే లైన్ ఉంటుంది. ఇది మొనొరైల్ (డ్రైవర్ లేకుండా నడిచే రైళ్ళు). ఇంకా పడవలో కూడా వెళ్లవచ్చు. రేయిన్ బో బ్రిడ్జి క్రింది నుండి వెళ్ళే పడవ ప్రయాణం చాలా బాగుంటుంది. అక్కడ మరైన్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం, సోని మ్యూజియం, పానాసోనిక్ మ్యూజియం, ఫుజి టివి భవనం, ఆక్వాసిటి షాపింగ్ కాంప్లెక్స్ చూడవచ్చు.

13. ఉఎనొ పార్క్:



cherry blossom కి చాలా ప్రఖ్యాతిగాంచిన పార్క్. వసంతకాలంలో మొత్తం రంగులపూలతో (ముఖ్యంగా పింక్) అందంగా ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది కుటుంబాలతో, స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి, తెచ్చుకున్న ఆహారపదార్ధాలు తింటూ సరదాగా గడుపుతారు. ఇంకో పది రోజుల తరువాత మొదలయి ఒక ౩ వారాలు చూడటానికి బాగుంటుంది.

కమకుర, ఫుజి పర్వతం, హకొనె, నాగఓకా హనాబి ల గురించి నా పాత టపాలు చూడగలరు. చాలా పెద్ద పెద్ద రోలర్ కోస్టర్ ల తో ఫుజి క్యు హై లాండ్స్ (ఫుజి పర్వతం దగ్గర) చాలా బాగుంటుందట, కాని వెళ్ళటం కుదరలేదు.

ఇంకో మూడు రోజులలో ఇండియాకి తిరిగి వస్తున్నాను. ఇక జపాన్ నుండి, జపాన్ గురించి ఇంతే సంగతులు.
సయోనరా !!!! (మీకు కాదులేండి, జపాన్ కు)

జపాన్ లో చూడదగ్గ ప్రదేశాలు - 2  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

5.క్యోటో:





క్యోటో జపాన్ కి ఒకప్పటి రాజధాని (క్యోటో అంటే రాజధాని అని అర్థం). చారిత్రకంగా ఉన్న ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకొని రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఈ నగరం పై బాంబు దాడులు జరగలేదు (అణుబాంబు కూడా వేద్దామనుకున్నారట). టోక్యో నుండి క్యోటో కు బుల్లెట్ ట్రైన్ లో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు.

క్యోటో లో చాలా గుడులు ఉన్నాయి. ఇక్కడి గుడులలో ఉండే తోటలు జపాన్ లోనే అందమైన తోటలనుకుంటాను. గుడులలో ముఖ్యంగా చూడవలసిన గుడులు 'కిన్ కకుజి' (బంగారంతో పూత పూయబడిన గుడి), 'కియొమిజుదెర' ( చుట్టూ పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది ), 'గిన్ కకుజి' ( అందమైన రాక్ గార్డెన్ ఉంది ), 'సన్ జుసన్ గెందొ' ( మనిషి ఎత్తులో 1001 బుద్దిని లోహ విగ్రహాలు ఉన్నాయి, హిందుమతం నుండి బౌద్ద మతం లోకి తీసుకోబడిన దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి, ప్రతీ విగ్రహం క్రింద సంస్కృతం పేరు, జపనీస్ పేరు వ్రాసి వుంటుంది), 'ఫుషిమి ఇనరి' ( షింటో తోరణాలతో ఉండే దారి ప్రత్యేక ఆకర్షణ).

క్యోటోకి వెళ్ళే వారు తప్పకుండా వెళ్ళే ప్రదేశం ’గియాన్’. ఇక్కడ ఉండే రెస్టారెంట్లలో, టీ హౌస్ లలో గీషా లు ( సాంప్రదాయమైన బట్టలు వేసుకొని అతిధులను entertain చేసేవారు) ఉంటారు. ఇవి కొన్ని ప్రత్యేకమైన వీధులలో ఉంటాయి.

6.ఒసాకా:



ఒసాకా జపాన్ లో రెండవ ప్రధాన నగరం. క్యోటో నుండి గంటలో ఒసాకా చేరుకోవచ్చు. ఒసాకాలో castle చాలా బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసినది యూనివర్సల్ స్టూడియో. అమెరికా బయట ఉన్న ఒకేఒక్క యూనివర్సల్ స్టూడియో (సింగపూర్ లో వచ్చే సంవత్సరం కట్టడం పూర్తవుతుంది). ఇక్కడి రైడ్ లు చాలా బాగుంటాయి, కాకపోతే అంతా జపనీస్ లో ఉంటుంది (అంటే షోస్ లో వాళ్ళు మాట్లాడే మాటలు), అది ఒక్కటే కొద్దిగా ఇబ్బంది.

7.నారా:





నారా జపాన్ మొదటి రాజధాని. క్యోటో, ఒసాకా ల నుండి గంటలో వెళ్ళవచ్చు. ఈ మూడు ప్రదేశాలు ఒక్క చోటే కాబట్టి సాధారణంగా 3,4 రోజులు అక్కడే ఉండి అన్నీ చూసుకొని వెళ్తారు (మేము క్యోటోలో ఉన్నాము). నారా లో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం తోదాజి దేవాలయం. ఇది జపాన్ లో ముఖ్య బౌద్ధ దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్న బుద్ధ విగ్రహం జపాన్ లో పెద్దది (head temple), అంతేకాక అది ప్రపంచంలోనే చెక్కతో చేయబడిన నిర్మాణాలలో పెద్దది. నారా జింకల పార్క్ కూడా చాలా బాగుంటుంది. అది మాములు పార్క్ లా ఉండి, జింకలు ఇష్టమున్నట్టుగా తిరుగుతూ ఉంటాయి. వాటికి మనం తినిపించవచ్చు.

8.Sea World:





పసిఫిక్ మహా సముద్రం ఒడ్డున ఉంది. ఇక్కడికి టోక్యో నుండి 2 గంటల ప్రయాణం. ఇది sea paradise కన్నా పెద్ద అక్వేరియం. ఇక్కడ డాల్ఫిన్, సీల్, వేల్ ప్రత్యేక షోలు చాలా బాగుంటాయి. ఇది కేవలం అక్వేరియం మాత్రమే.

9.మౌంట్ తకావో:



తకావో పర్వతం టోక్యో కి దగ్గరలో ఉండే చిన్న పర్వతం. నగర జీవితం నుండి దూరంగా చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం. ఇది చిన్నదైనప్పటికి చాలా పచ్చగా ఉంటుంది. నవంబర్ లో మొత్తం autumn leaves తో orange colour లోకి మారిపోతుంది. చాలా హైకింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ పర్వతాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు/పూజిస్తారు(చాలా సార్లు చెప్పినట్టు వీళ్ళు ప్రకృతి ఆరాధకులు). మన దగ్గరిలా ఇక్కడ కూడా పర్వతాలు, కొండలపై గుడులు ఉంటాయి. తకావో మీద కూడా ఒకటి ఉంది. తకావో గురించి ఇంకో గమ్మత్తైన విషయం ఉంది. యువజంటలు కలిసి ఈ పర్వతం ఎక్కితే తొందరలోనే విడిపోతారని అంటారు ( చాలా మంది నమ్మరు, అది వేరే విషయం ).

జపాన్ లో చూడదగ్గ ప్రదేశాలు - 1  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

నేనిక్కడ చూసిన చాలా ప్రదేశాల గూర్చి రాద్దామనుకున్నాను. కాని అవి రాయడానికి తక్కువలో తక్కువ 12,15 టపాలైనా పట్టేట్టున్నాయి. కాని అంత ఓపిక లేదు, అంతేకాక ఇంకో మూడు వారాల్లో నా తిరుగు ప్రయాణం. కాబట్టి ఒక 2,3 టపాల్లో "కట్టె, కొట్టే, తెచ్చే" అన్నట్లుగా వాటి గురించి రాద్దామనుకుంటున్నాను. జపాన్ కి కొత్తగా వచ్చే వారికి, పర్యటించాలనుకున్న వారికి ఉపయోగ పడుతుందనుకుంటుంన్నాను. (నేను కూడా మరిచిపోకుండా ఉండవచ్చనుకోండి, అది వేరే విషయం).

1.టోక్యో టవర్ : world's tallest self-supporting steel tower



ఈఫిల్ టవర్ ని అనుకరిస్తూ, దాని కన్నా ఒక 13 మీటర్లు ఎక్కువ పొడవు గా ఉండేట్టుగా కట్టిన కట్టడం. 50 సంవత్సరాల క్రితమే దీన్ని కట్టడం జరిగింది. ఈఫిల్ టవర్ అంత అందంగా ఇది కనపడదు కాబట్టి అంతగా పేరు రాలేదనుకుంటాను. 150మీటర్ల ఎత్తులో ఒక observatory, 250 మీటర్ల ఎత్తులో ఇంకో observatory ఉన్నాయి. ఈ observatory లే కాక టోక్యో టవర్ లో చూడటానికి చాలా ఉన్నాయి. గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ మ్యూజియం, మైనపు బొమ్మల మ్యూజియం, ట్రిక్ ఆర్ట్ గ్యాలరీ (images which creates illusion), ఆప్టికల్ ఇల్యూజన్ గ్యాలరీ (ఇప్పుడు లేదనుకుంటాను), అక్వేరియం ఉన్నాయి. ఇవే కాక చిన్న రెస్టారెంట్లు, చిన్న పిల్లలు ఆడుకోడానికి చిన్న పార్క్ లాంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద టోక్యో టవర్ చాలా బాగుంటుంది, ఒక్క రంగు తప్ప (ఇక్కడి నియమాల ప్రకారం టవర్లకు ఆ రంగు వెయ్యాలట). ఒక రోజు మొత్తం అందులో గడపవచ్చు. ఇప్పుడున్న ఈ టవర్ TV channels కి సరిప్పోవడం లేదని దాదాపు దీనికి రెండింతల ఎత్తులో ఇంకో టవర్ (610m, Tokyo Sky Tree) కడుతున్నారు. అది ఇంకో మూడు సంవత్సరాలకు పూర్తవుతుందట.

2.నిక్కో:



టోక్యో కి 140 కి.మీల దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశం. ఇది ముఖ్యంగా షింటో, బౌద్ధ దేవాలయాలకి ప్రసిద్ది చెందింది. నిక్కో కూడా నేషనల్ పార్క్ గా గుర్తించబడింది. చుట్టూ కొండలతో, పచ్చని చెట్లతో ఉంటుంది ( జపాన్ లో 70% పర్వత ప్రాంతం కాబట్టి వాటి దగ్గరే అందాలన్నీ ). ఇక్కడి గుడులు చాలా పురాతనమైనవి. రకరకాల రంగులతో మలచబడ్డ శిల్పాలు, బంగారు రంగులో చేయబడ్డ పూల, లతల ఆకృతులతో చూడడానికి చాలా బావుంటాయి. ఇవి జపాన్ లో అన్నింటికన్నా అందమైన దేవాలయాలు. ఇక ఇక్కడి తోటలు చాలా బాగుంటాయి. ప్రకృతే దైవం అని అనిపించకమానదు. చుట్టూ కొండలు ఉన్నాయి కాబట్టి, ఎన్నో హైకింగ్ కోర్సులు ఉన్నాయి.


పై రెండు ఫోటోలు గూగిలించినవి, నేను తీసినవి కాదు



నవంబర్ లో నిక్కో కి వెళ్తే చాలా బాగుంటుంది. It will be full of autumn leaves. కొగెన్ జలపాతం( హైడ్రల్ విద్యుత్తును ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు), ర్యూజూ జలపాతం, చుజెంజి సరస్సు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. చలికాలంలో మంచు చాలా పడుతుంది. అప్పుడు ఇక్కడ స్కీయింగ్ కూడా చేస్తారట.

3.Sea paradise
:





అక్వేరియం, థీం పార్క్ రెండూ ఒక్కచోటే ఉండటం దీని ప్రత్యేకత. ’యొకొహమ’ కి దగ్గర్లో ’హకెజిమ’లో ఇది ఉంది. దాదాపు లక్ష రకాల సముద్రపు జీవులతో మూడంతస్తుల అక్వేరియం ఉంది. రక రకాల చేపలు, హైడ్రా, షార్క్, డాల్ఫిన్, తాబేళ్ళు, సముద్రపు గుర్రం, సీల్, పెంగ్విన్ ఇలా చాలా రకాల జీవులు ఉన్నాయి. అంతే కాక డాల్ఫిన్, సీ లయన్, సీల్ లతో ఒక ప్రత్యేకమైన షో కూడా ఉంది. ఒపెన్ అక్వేరియంలో మనం డాల్ఫిన్, సీల్ లను తాకవచ్చు కూడా. థీం పార్క్ లో సగం నీటిలో సగం నేలపైన ఉండే రోలర్ కోస్టర్, 100మీ ఎత్తులో ఉండే vertical fall, ఆక్వా రైడ్ ఇలా కొన్ని రైడ్స్ ఉన్నాయి. ప్రక్కనే టోక్యో సముద్రం బీచ్ ఉంది.

4.Gala Yuzawa snow resort
:



జపాన్ రైల్వే తో అనుసంధానించబడ్డ స్నో రిసార్ట్. టోక్యో నుండి ’షిన్ కన్ సెన్’ (బుల్లెట్ ట్రైన్) లో దాదాపు రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. స్టేషన్ లోనే స్కీ పరికరాలు అద్దెకు తీసుకొని గొండొల(రోప్ వే) లో రిసార్ట్ కి వెళ్ళవచ్చు. రైలు టికెట్ చూపెడితే స్కీ పరికరాల అద్దె కొద్దిగా తగ్గిస్తారు. కొత్తగా వెళ్ళే వారికి ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది. చిన్న కోర్సులు కొద్దిపాటి వాలు తో ఉంటాయి. 'గాలా' కి దగ్గర్లో ఉన్న నయెబా లో కూడా చాలా పెద్ద skii resort ఉంది. కాకపోతే అక్కడికి సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు వెళ్తారు. రైలు సౌకర్యం అంతగా లేదు.

హకొనె, జపాన్ - ట్రావెలాగ్  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



టోక్యోకి దగ్గరలో ఉండే 'హకొనె నేషనల్ పార్క్' ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రదేశం. చుట్టూ పర్వతాలతో అందంగా కనపడే 'అషినొకొ సరస్సు', చాలా పురాతనమైన 'షింటో దేవాలయం', పొగలు కక్కుతూ ఆహ్వానం అందించే 'హకొనె అగ్నిపర్వతం', కళాఖండాలతో నిండి ఉన్న 'ఒపెన్ ఏయిర్ మ్యూజియం', ఈ ప్రదేశాలన్నింటిని కలుపుతూ ఉన్న రోప్ వే, కేబుల్ కార్, పడవలు, పర్వతాల మీద నడిచే రైళ్ళు, బస్సులలో ప్రయాణం, అన్నీ చాలా బాగుంటాయి. చుట్టూ పర్వతాలు ఉండటం వల్ల అక్కడి 'ఒన్ సెన్' (Hotspring) (సహజ సిద్దంగా వేడి అయిన నీటి లో స్నానం చేసే ప్రదేశాలు) లు చాలా ఉన్నాయి. చాలా ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిచోట టికెట్లు తీసుకోనవసరం లేకుండా మొత్తం అన్నింటికి కలిపి ఒక పాస్ తీసుకోవచ్చు, కాని రెండు లేక మూడు రోజులు తిరగగలిగే పాస్ లు దొరుకుతాయి. మేము అక్కడ ఉండేది ఒక్క రోజైనా రెండు రోజుల పాస్ తీసుకోవలసి వచ్చింది.



’హకొనె-యుమొతొ’ స్టేషన్ చేరుకొని అక్కడి నుండి మా యాత్ర మొదలుపెట్టాము. మొదట అషి సరస్సు కు బస్సులో బయలుదేరాము. ఈ ప్రయాణం అంతా ఘాట్ రోడ్డుపైనే. చల్లని వాతావరణం, మెలికల రోడ్లు, దట్టంగా ఉన్న చెట్లతో కొండల మధ్య ప్రయాణం చాలా బాగుంది. కొడైకెనాల్, శబరిమలై లా అనిపించింది.



'అషి సరస్సు'కు దగ్గర్లో 'షింటో దేవాలయం' ఉంది. ఆ ప్రదేశం ఒక చిట్టడివి లా ఉంటుంది. అక్కడి నుండి 'తొగెందయి' కి పడవలో (అషి సరస్సు పై) బయలుదేరాము. అవి చూడటానికి 'pirate ships' లా ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా పర్వతాలే కాబట్టి వాటి మధ్య ప్రయాణం చాలా బాగుంది. 'ఫుజి పర్వతం' కూడా అక్కడి నుండి బాగా కనపడుతుంది.



'తొగెందయి' నుండి 'హకొనె పర్వతం' పైకి రోప్ వే ఉంది. ఇందులో క్యాబిన్ లు కొద్దిగా పెద్దగా ఉన్నాయి. దాదాపు పది మంది దాకా ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. అలా హకొనె పర్వత శిఖరాన్ని చేరుకున్నాము. 3000 సంవత్సరాల క్రితం ఈ పర్వతం బద్దలయ్యింది. ఆ crator చుట్టూ అగ్నిపర్వతం ఇంకా క్రియాశీలకంగానే ఉంది. చాలా చోట్ల నుండి పొగలు రావడం చూడవచ్చు. crator దగ్గర సల్ఫ్యూరిక్ ఆవిరుల వాసన ఎక్కువగా ఉంటుంది. దగ్గరలో వేడి నీటి ప్రవాహాలను, 'ఒన్ సెన్' (Hotspring) లను చూడవచ్చు. అక్కడి సహజ సిద్ధమైన వేడి నీటిలో కోడిగ్రుడ్లను ఉడికించి అమ్ముతారు. సల్ఫ్యూరిక్ ప్రభావం వల్ల వాటి రంగు నల్లగా మారుతాయి. కాని లోపల మాములుగా తెల్లగానే ఉంటాయి. ఈ గ్రుడ్డు ఒక్కటి తింటే 7 సంవత్సరాలు ఎక్కువ బ్రతక వచ్చు అని ఇక్కడి వారి నమ్మకం. నేను రెండు తిన్నాను, అయితే 14 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతానేమో చూడాలి !!



ఆ తరువాత రోప్ వే లోనే 'సౌంజన్' కి చేరుకున్నాము. అక్కడి నుండి 'గొర పార్క్' కి కేబుల్ కార్ లో ప్రయాణం. ఈ కేబుల్ కార్ ఇంచుమించు రైలు లాగే ఉంది, కాకపోతే చాలా చిన్నది. గొర పార్క్ రంగురంగుల చెట్ల తో అందంగా ఉంది. గొరపార్క్ తరువాత స్టాప్ లో 'హకొనె ఒపెన్ ఏయిర్ మ్యూజియం' ఉంది. ఈ మ్యూజియం అంతా గడ్డి మైదానాలు, మధ్యమధ్యలో కళాఖండాలతో ఉంటుంది. చుట్టూ లోయలు, పర్వతాలవల్ల ఇంకా అందంగా కనపడతాయి. అంతేకాక paintings, sculptures మ్యూజియం కూడా ఉంది.

ఆ తరువాత ’హకొనె-తొజన’ రైలులో ప్రయాణం. ఈ రైలు, పర్వతం పై నుండి క్రిందికి దిగడానికి. దీంట్లో ప్రయాణం మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఆ లోయల మధ్య ఎన్నో వంతెనలు, సొరంగ మార్గాలు కట్టారు. జపనీయుల సాంకేతికతను మెచ్చుకోకుండా ఉండలేము. ఆ రైలు మొదట ఒక దిశలో క్రిందికి(కొద్దిగా వాలుగా) వెళ్ళి కొంత దూరం తరువాత లైన్ మారి వ్యతిరేక దిశ లో క్రిందికి వెళ్తుంది. అలా మూడు, నాలుగు సార్లు మారుతుంది. అంటే మనం మెట్లు దిగినట్లుగా అన్నమాట. జూన్, జూలైలలో అక్కడ పూచే ఒక ప్రత్యేకమైన పూలతో ఆ ప్రాంతం చాలా అందంగా ఉంటుందట.

ఇవే కాక ’హకొనె’ లో చూడటానికి చిన్న చిన్న మ్యూజియం లు, పార్క్ లు చాలా ఉన్నాయి. ఇక ఇక్కడ ప్రఖ్యాతి చెందినవి ’ఒన్ సెన్’ లు (hotspring).’హకొనె’లో ఇవి చాలా ఉన్నాయి. ప్రొద్దున అంతా తిరిగిన తరువాత సాయంత్రం ఉపశమనం కోసం 'ఒన్ సెన్' లకు వెళ్తారు. సాధారణంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి వేరు వేరు గా ఉంటాయి. ఈ 'ఒన్ సెన్' లు చూడటానికి చాలా చిన్న స్విమ్మింగ్ పూల్ లా ఉండి, పర్వతాల నుండి వచ్చే సహజమైన వేడి నీటి తో నింపుతారు. ఈ నీళ్ళు చాలా వేడి గా ఉంటాయి (40-45 డిగ్రీలు). మొదట మంచిగా స్నానం చేసి, తరువాత ఆ వేడి నీటిలో కూర్చుంటారు. జపనీయులకి ఇది చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళే ముందు అక్కడి పద్దతులు ముందే తెలుసుకొని వెళ్ళడం మంచిది, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. నేను అక్కడి 'ఒన్ సెన్' కి వెళ్ళలేదు. కాని ఒకసారి ఒక 'skii resort' కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాను. అది మంచుపర్వతాన్ని అనుకొని ఉన్న 'open air hotspring'. బయట -10 డిగ్రీలు నీళ్ళు 45 డిగ్రీలు. కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా చాలా బాగుంటుంది. indoor కూడా ఉంది. ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారన్న ప్రయత్నించాలి.

గాలిపటాలు, వాటితో నా ఙ్ఞాపకాలు  

Posted by ప్రపుల్ల చంద్ర in



సంక్రాంతి అంటే అందరికి భోగి మంటలు, ముగ్గులు, గొబ్బిల్లు, గంగిరెద్దులు గుర్తుకువస్తాయి. నాకు మాత్రం వీటితో పాటు గాలి పటాలు గుర్తుకువస్తాయి. చిన్నప్పుడు చాలా ఎగురవేసేవాళ్ళం, సంక్రాంతి కి నెలరోజుల ముందు నుండి ఉండేది మా హడావుడి, ఎప్పుడు సంక్రాంతి సెలవులు వస్తాయా అని ఎదురుచూసేవాడిని. కాని ఈ మధ్య ఎక్కడా గాలిపటాల హడవుడి అంతగా లేదు. ఇప్పుడు పిల్లలు ( మా బంధువులలో నేను చూసినంత వరకు అందరూ ) పోగో, జెటిక్స్ అంటూ కార్టూన్స్ చూస్తూ ఇంటి బయటికే రావడం లేదు, మన చిన్నప్పుడు అవి ఉంటే మనం కూడా అలాగే తయారయ్యేవాళ్లమేమో, మన అదృష్టం కొద్దీ అప్పుడు అంత అభివృద్ది చెందలేదు. హాయిగా బయటే ఆడుకునేవాళ్లం. ఇక వెన్నెల్లో ఆడిన ఆటలు ఎప్పుడూ మరచిపోలేము. సంక్రాంతి సెలవుల్లో మాత్రం ఎప్పుడూ డాబా పైనే ఉండేవాళ్ళం. గాలిపటాలతో నా జ్ఞాపకాలను పంచుకోవాలనే నా ప్రయత్నమే ఈ టపా. ఇక నేను చెప్పబోయే కొన్ని పదాల గురించి హైదరాబాద్ వాళ్ళకి, హైదరబాద్ చుట్టుప్రక్కల వాళ్లకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది, తెలంగాణా ప్రాంతం వాళ్ళకి కాక వేరే వారికి తెలియదనుకుంటాను. ఇవి తెలిసిన వారికి గుర్తు చేయడానికి, తెలియని వారు తెలుసుకోవడానికి.



మేము గాలిపటాలని పతంగులు అంటాం. సంక్రాంతి సమయంలో గాలిపటాలు అమ్మడానికి కొత్త కొత్త దుకాణాలు వెలిసేవి, వేరే దుకాణాలలో కూడా అమ్మేవారు. అన్నీ రంగురంగుల పతంగులతో కలకలలాడేవి ఒక నెల రోజులు. రకరకాల పతంగులు దొరికేవి, వాటి మీద ఉండే గుర్తులను బట్టి వాటి పేర్లు ఉండేవి. గుడ్డు పతంగి ( పతంగి మధ్యలో వృత్తాకారంలో గుర్తు ఉంటే), రెండు గుడ్ల పతంగి, నామం పతంగి, కత్తెర పతంగి, టోపి పతంగి, జెండా పతంగి (రెండు, మూడు రంగులతో జెండాలా ఉంటే ) ఇలా రకరకాల పతంగులు ఉండేవి, మళ్ళీ ఈ గుర్తులు కూడా రెండు, మూడు ఒకే పతంగీలో ఉండేవి అంటే రెండు గుడ్లు ఉండి క్రింద కత్తెర గుర్తు అలా. పతంగి రంగులు, గుర్తుల రంగులతో వాటిని పిలిచేవాళ్ళం. తరువాత ప్లాస్టిక్ కవర్లతో చేసిన పతంగులు, ఎవేవో బొమ్మలు ముద్రించిన పతంగులు ఇలా వచ్చాయి కాని చూడడానికి అంత బాగుండేవి కావు. పెద్ద పెద్ద పతంగులని ’డోరీ’ అనేవాళ్ళం. అవి చాలా సన్నని కాగితం తో చేయబడి చుట్టూ దారం అతికించి ఉండేవి. మేము కూడా అప్పుడప్పుడు తయారు చేసేవాళ్ళం, కాని అవి కొద్దిగా బరువుగా ఉండేవి. అప్పుడప్పుడు అవి ఎగిరేవి కూడా కావు.

పతంగులను నియంత్రించడానికి కట్టే దారాన్ని ’కార్ణాలు’ అనే వాళ్లం. ఇది కట్టే విధానాన్ని బట్టి పతంగులు ఎగురుతాయి. ఒక రకంగా కడితే పతంగి బొమ్మలా గాలిలో కదలకుండా నిలబడేది, వాటిని ’బొమ్మ కార్ణాలు’ అంటారు. సరదాగా అప్పుడప్పుడు అలా కట్టి ఎగరవేసి చాలా దూరం పోనిచ్చి, అలాగే గాల్లో ఉంచి, డాబా పై నుండి క్రిందికి వెళ్ళి అమ్మతో గొప్పగా చెప్పుకునేవాణ్ణి. అప్పుడప్పుడు పతంగులు సరిగ్గా ఎగరడానికి తోకలు అతికించవలసి వచ్చేది.



పతంగుల మధ్య పోటీని ’పేంచ్’ అంటారు (ఒకదానితో మరొకటి కోయడం). దాని కోసం గట్టి దారం ( మాంజా ) కొనేవాళ్లం, అవీ రకరకాల రంగులలో దొరికేవి. పాలపిట్ట రంగు మాంజా, పసుపు రంగు మాంజా ఇలా చాలా రకాలు ఉండేవి. ఏది మంచిదో తెలుసుకొని ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి కొనుక్కునేవాళ్ళం. మేము కూడా గాజుపెంకులు నూరి, కలమంద, అన్నం ముద్ద అన్నీ కలిపి దారానికి రుద్ది మాంజా తయారుచేసేవాళ్ళం.

ఇక ఈ పేంచ్ లో రకరకాల పద్దతులు ఉండేవి. ముఖ్యంగా పతంగి కొద్దిగా బరువుగా ఉండి మంచి మాంజా ఉండాలి. రెండు పతంగులు ముడిపడ్డ తరువాత దారం పదునుని బట్టి ఎదో ఒకటి వెంటనే తెగిపోతుంది. ఒకవేళ రెండూ సమానంగా ఉంటే మాత్రం చాలాసేపు పడుతుంది, దీన్ని ’మొండి పేంచ్’ అనేవాళ్ళం. దారాన్ని వదులుతూ, దారాన్ని లాగి మళ్ళీ వదిలి (దీన్ని ’కీంచ్ కట్’ అనే వాళ్ళం), బలంగా దారాన్ని లాగడం ఇలా ఒక్కో దారాన్ని బట్టి ఒక్కోలా చేసి అవతలి వారి దారాన్ని కోసేవాళ్ళం. వాళ్ళ పతంగి తెగిపోతే ’అఫా’ అని గట్టిగా అరిచేవాళ్ళం. అప్పుడప్పుడు దారాన్ని లాగుతూ ఉంటే అవతలివారి పతంగి మన చేతికి వస్తే దాన్ని ’లుప్టా’ చేయడం అంటారు. ఇలా చేయడం వల్ల గొడవలు కూడా జరిగేవి. పేంచ్ చేసేప్పుడు ముఖ్యమైంది పక్కన ఉండి దారం అందించేవాళ్ళు. ’చరఖా’ పట్టుకొని దారం వదలడం ( మేము రీల్ వదలడం అనేవాళ్ళం), దారాన్ని తొందరగా చుట్టడం (దీనికీ కొన్ని పద్దతులు ఉండేవి), దారం చిక్కులు పడకుండా చూసుకోవడం వీరి భాద్యత. మా అన్నయ్య ఎగిరేసేప్పుడ్డు నేనే చరఖా పట్టుకునేవాడిని.

పతంగులు ఎగిరేసేటప్పుడు చెట్లకు, స్తంభాలకి తట్టుకుంటూ ఉండేవి. అలా తట్టుకుంటే మాములుగా అయితే కర్రలతో తీసేవాళ్ళం. లేకపోతే దారానికి కొద్దిగా బరువున్న రాయిని కట్టి ( దీన్ని లండోరి అంటారు ), రాయిని జాగ్రత్త గా పతంగి దారం పై విసిరి లాగేవాళ్ళం. అప్పుడు మాంజా, దారం చాలా ఉండేది కాబట్టి లండోరి తయారు చేసుకొని పోటీలు కూడా పెట్టుకునేవాళ్ళం, ఎవరి దారం తెగిపోతే వారు ఓడిపోయినట్టు.

సంక్రాంతి ముందు రోజు మా ఊర్లో పెద్ద పతంగుల పోటీ జరిగేది. ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరి పతంగి ఏ రంగు, ఎవరు గెలిచారు, ఇలా చెబుతూ మైక్ సెట్స్ ద్వారా ప్రత్యక్ష వ్యాఖ్యానం (live commentry) ఉండేది. కాకపోతే మేము ఎప్పుడు పాల్గొనలేదు అందులో.

మొత్తానికి అలా ఒక నెలరోజులు బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. పండగ రోజు ఇప్పటికీ మా స్నేహితులు ఎగురవేస్తారనుకుంటాను. కాని అప్పటిలా లేదు ఇప్పుడు. ఇప్పుడు చేయలేకపోయినా ఆ ఙ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

కమకుర, జపాన్ - ట్రావెలాగ్  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



’కమకుర’ నాకు జపాన్ లో చాలా బాగా నచ్చిన ప్రదేశం. కమకుర 800 సంవత్సరాల క్రితం జపాన్ కి రాజధానిగా ఉండేది, అదే సమయంలో ఇక్కడ ఎన్నో బౌద్ద, షింటో దేవాలయాలు కట్టడం జరిగింది. ఎన్నో గుడులకి, బీచ్ లకి ప్రఖ్యాతి చెందింది. టోక్యో నుండి ఒక గంటలో అక్కడికి చేరుకోవచ్చు.



మొదట మేము ’కెన్ చోజి’ అనే జెన్ బౌద్ద దేవాలయానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి అక్కడ ఎవరూ లేరు. గిలిగింతలు పెడుతున్న చలి, సూర్యున్ని మింగేసిన మేఘాలు, చుట్టూ రకరకాల చెట్లు (ముందే చెప్పిన్నట్టు ఇక్కడి గుడులలో తోటలు చాలా అందంగా ఉంటాయి), చుట్టూ ఉన్న కొండలు, వాటి మీద దట్టంగా ఉన్న చెట్లు, అక్కడక్కడ ఉన్న గుడులు, లయబద్దంగా పక్షుల చేస్తున్న శబ్దం, వీటన్నిటితో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా రోజుల తరువాత నగరానికి దూరంగా వచ్చినందుకు అనుకుంటాను ఆ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది. అంతా కలయతిరిగి వెళ్ళిపోయే సమయానికి జనాలు రావడం మొదలుపెట్టారు. ఆ తరువాత ’ఎన్ గకుజి’ దేవాలయానికి వెళ్ళాము, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఎక్కువ మంది ఉండే సరికి మొదటి ప్రదేశం అంత ప్రశాంతంగా లేదు, కాని తోటలు మాత్రం ఎప్పటిలా చాలా బాగున్నాయి.



కమకుర లో హైకింగ్ ట్రయల్స్ కూడా చాలా బాగుంటాయి. మేము గ్రేట్ బుద్ద విగ్రహాన్ని చేరే విధంగా మా హైకింగ్ కోర్స్ ని ఎంచుకున్నాము. చూడటానికి చిట్టడవిలా ఉండి ఎగుడుదిగుడు కొండలతో హైకింగ్ చాలా సరదాగా అనిపించింది. మధ్యలో ’జెనియరయి బెంతెన్’ గుడి కి వెళ్ళాము. జెనియరయి అంటే డబ్బులను కడగడం అని అర్ధం. డబ్బులను కడగడం ఏంటని అంటారా, ఇక్కడి గుడిలో ఒక చిన్న గుహ ఉంది, అందులో ఒక చిన్న నీటి ప్రవాహం ఉంటుంది, ఆ నీటి తో డబ్బులను కడిగితే అవి రెట్టింపు అవుతాయని వారి నమ్మకం (వెంటనే కాదండోయ్, కొన్ని రోజుల తరువాత !!). చాలా మంది డబ్బులను కడుగుతూ కనపడ్డారు, మేము కూడా మా అదృష్టాన్ని పరిక్షించుకున్నాము. కొందరైతే నోట్లను కూడా కడుగుతున్నారు, ఆ తరువాత బయట ఉన్న అగరుబత్తీల వేడిలో ఆరబెట్టుకున్నారు. ఇది గమనిస్తున్న కొందరు పాశ్చత్యులు "వీళ్లేంటి డబ్బులను తగలపెడుతున్నారు" అని జోకులు వేసుకుంటున్నారు. అయినా ఎవరి నమ్మకాలు వారివి.



తరువాత మళ్ళీ మా నడకను మొదలుపెట్టాము. దూరంగా కనపడే పసిఫిక్ మహాసముద్రం చూడడానికి ఎంతో బాగుంది. దాదాపు ఒక గంట నడక తరువాత ’గ్రేట్ బుద్ద’ విగ్రహం (డయిబుట్సు) కి చేరుకున్నాము. ఇది రాగితో చేసిన విగ్రహం. ఈ ప్రదేశంలో మొదట ఒక గుడి ఉండేది, కాని 15వ శతాబ్దంలో వచ్చిన సునామి వల్ల గుడి మొత్తం కొట్టుకుపోయి ఒక విగ్రహం మాత్రం మిగిలిఉంది. అలా అప్పటి నుండి ఆ విగ్రహం బయటే ఉండేసరికి ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. విగ్రహం క్రింద ఉన్న మెట్ల ద్వారా విగ్రహం లోపలికి వెళ్ళవచ్చు.




ఫోటో : గ్రేట్ బుద్ద పాదరక్షలు

డయిబుట్సు తరువాత అక్కడికి దగ్గర్లోనే ఉన్న ’హసెదర’ అనే జొడొ బౌద్దమతానికి చెందిన గుడికి వెళ్ళాము. ఆ గుడిలో చెక్కతో చేయబడిన Kannon(god of mercy) పదకొండు తలల విగ్రహం ఉంది. ఇది జపాన్ లో చెక్కతో చేయబడిన విగ్రహాలలో పెద్దది. గుడిలో ఉన్న చిన్న చిన్న సరస్సులు తాబేళ్ళు, చేపలతో ఉండి చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. ఆ గుడిలో ఉన్న ఒక గుహలో ఇంకా ఎన్నో విగ్రహాలను చూడవచ్చు. గుడి ప్రక్కనే చిన్న మ్యూజియం ఉంది. అందులో హిందూమతం నుండి బౌద్దమతం లోకి తీసుకోబడిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంద్ర, సూర్య, వరుణ ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటి క్రింద జపనీస్ పేర్లు ఉండి దాని ప్రక్కనే సంస్కృతంలో పేర్లు ఉన్నాయి. కమకురలో ఇంకా చాలా గుడులు ఉన్నాయి, కాని సమయాభావం వల్ల వెళ్ళడం కుదరలేదు.



చివరగా పసిఫిక్ మహాసముద్ర తీరానికి చేరుకున్నాము. పసిఫిక్ సముద్రాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నది ప్రత్యక్షంగా చూడటం ఒక విధంగా సంతోషమేగా మరి.అతి పెద్దదైన మహా సముద్రం కాబట్టి చూడటానికి గంభీరంగా కనపడింది. సర్ఫింగ్, యాచింగ్ చేసే వాళ్ళు చాలా మంది కనపడ్డారు. అక్కడి బీచ్ లోనే సాయంత్రం వరకు గడిపి సూర్యాస్తమయాన్ని చూసి వెనుదిరిగాము.


నేను తీసిన ఫోటోలలో నాకు చాలా నచ్చిన ఫోటో

రోటీ, కపడా, మకాన్ ఔర్ ?  

Posted by ప్రపుల్ల చంద్ర in



ఇప్పుడు ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెబుతారు ’రక్షణ’ అని, ఎందుకంటే అదికూడా ఒక ప్రాధమిక అవసరంగా మారింది. ఇంటి బయట అడుగుపెడితే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదు, వస్తామో లేదో అని. మొన్న జరిగిన హింసాకాండకి చలించని వారుండరు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగేసరికి దేశమంతటా భారీ స్పందన వచ్చింది, కాని ఇలాంటి సంఘటనలు దేశవిభజన నాటి నుండి కాశ్మీర్ లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు తెగబడి ఏ ప్రాంతం లో కావాలనుకుంటే అక్కడ విధ్వంసం సృష్టించగలుగుతున్నారు. భారతదేశంలోనే వారికి సహాయం దొరుకుతుందన్నది ఎవరూ కాదనలేని నిజం. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయో కొన్ని పూర్వాపరాలు, అవి ఆపే ప్రయత్నం ఎలా చేయవచ్చో అన్న నా ఆలోచనలని పంచుకోవాలనే ప్రయత్నమే ఈ టపా.

కాశ్మీర్ వరకే ఉండే గొడవలు దేశం మొత్తం వ్యాపించడానికి కారణం బాబ్రి మసీద్ కూల్చివేత అని అనుకునే వాడిని, కాని తీవ్రవాదం మాత్రం అప్పటినుండే మొదలయ్యింది. ఇక గొడవల విషయానికి వస్తే ముస్లిం రాజులు 11వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి మొదలయ్యింది. గుడులను ధ్వంసం చేయడం, మత మార్పిడులు చాలా జరిగాయి. అలా గొడవలు జరుగుతూ ఉండేవి. క్లాస్ లోకి టీచర్ వచ్చాక అల్లరి చేసే పిల్లలు కాస్త నిశ్శబ్దంగా కూర్చునేటట్లుగా, ఆంగ్లేయులు వచ్చాక గొడవలు తగ్గించేసారు. మ్యూటిని అప్పుడు ఆంగ్లేయులు చిచ్చు పెట్టినా.... తరువాత అది సర్దుకుంది. సరైన ప్రాతినిధ్యం లేదని అలీజిన్నా లాంటి నాయకులు కాంగ్రెస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. స్వాతంత్రం రావడం, భారతందేశంలో ముస్లింలకు న్యాయం జరగదని వారు భావించి ప్రత్యేక దేశం కావాలని అడగడం జరిగింది, ఆ తరువాతి పరిస్థితులు ఎంతో రక్తపాతానికి తెరతీసింది. తరువాత కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి.

ఇక బాబ్రి మసీద్ విషయానికి వస్తే బాబర్ ఆ మసీద్ కట్టినప్పటి నుండి అది వివాదాస్పదమే. రామజన్మ భూమి పైన ఉన్న గుడిని కూల్చి, అక్కడ మసీద్ కట్టారని వాదన ఉంది (అలాంటిది ఏమీ లేదని ముస్లింల వాదన). మ్యూటిని ముందు వరకు హిందు, ముస్లిం లు అందరూ అక్కడ పూజలు జరిపేవారు. కాని మ్యూటిని గొడవల తరువాత హిందువులను అనుమతించలేదు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఆ మసీద్ ముందే చేసేవారు. ఆ మసీద్ యొక్క ఒక భాగం లో హిందువులు గుడి కట్టాలని ప్రయత్నించినా అధికారులు అనుమతించలేదు. తరువాత జరిగిన గొడవలలో కొద్దిగా కూలిపోతే ఆంగ్లేయులు కట్టించారు. స్వాతంత్రం తరువాత 1949 లో ఒకరాత్రి కాపలా పోలిసుల కన్నుగప్పి సీతారాముల విగ్రహాలని లోపల ప్రతిష్టించారు. తరువాత హిందూ భక్తులు మసీద్ లోపలికి రావాలని ప్రయత్నించడం, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని ఆపి, ఆ గుడిని వివాదాస్పద ప్రదేశంగా పరిగణించి మూసివేసారు. 1984 నుండి అక్కడ గుడి కట్టాలని VHP, BJP లు గొడవలు చేయడం, కోర్టు ఆదేశాలని ప్రక్కన పెట్టి 1992 లో మసీద్ కూల్చడం జరిగింది. అది ఒక విధంగా మన రాజ్యాంగాన్ని మనమే వెక్కిరించినట్టు !!! నా ఉద్దేశ్యం ప్రకారం సరైన ఆధారాలు చూపి న్యాయపరంగా సాధించుకుంటే బాగుండేది. అది ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను!!! ఈ పని వల్ల సమస్య మరింత జటిలమైంది. మతవిద్వేషాలు రగిలి ఎన్నో గొడవలకి ఆజ్యం పోసింది. ముస్లింలలో అభద్రతాభావం పెంచింది. ఇది ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు కొందరిని రెచ్చగొట్టి వారి సహాయంతో చెలరేగిపోతున్నారు. రామజన్మభూమి దగ్గర జరిగిన త్రవ్వకాల ఫలితాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అక్కడ రామాలయం ఉందనే ఆధారాలు ఎన్ని దొరికాయో, లేవని కూడా అన్నే దొరికాయి. అసలు సంగతి రామునికే తెలియాలి !!!

మరి ఇప్పుడు ఏం చేయాలి !!!!

ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే తప్పులు ఇద్దరి వైపు జరిగిపోయాయి. అన్నింటికి అవతలి వారే కారణం అని చూపెట్టుకోవడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం మానెయ్యాలి.

అయోధ్యలో రాముడి గుడి గురించి ప్రస్తావన తీసుకు రాకపోవడం చాలా మంచింది. ఒకవేళ పట్టుబట్టి కట్టినా ( ఒకవేళ అక్కడ గుడి ఉందని ఋజువైతే! ) గుడికి ఎమైనా జరిగితే గోద్రా కన్నా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అనవసరంగా దేశంలో అస్థిరత వస్తుంది. అప్పుడు ఇంకెన్ని తీవ్రవాద సంస్థలు మొదలవుతాయో.

కాశ్మీర్ విషయానికి వస్తే అది ఇచ్చే సమస్యే లేదు. కాశ్మీర్ ఇచ్చినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదు, ఇంకా పెరిగినా పెరగొచ్చు. అంతే కాక అక్కడ ఉన్న 30% హిందువుల గురించి కూడా ఆలోచించాలి ( కనీసం ఈ విషయం లో నైనా మనం అన్ని దేశాలలా ఆలోచించాలి ). పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి అందరికి తెలిసిందే !!. పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి కన్నా భారతదేశంలో ముస్లింల పరిస్థితి బాగుందని ఖచ్చితంగా చెప్పగలను. 1989 లో కాశ్మీరీ పండిట్లకి వ్యతిరేకంగా జీహాద్ మొదలు పెట్టారు, స్వాతంత్రం ఇస్తే ఇంకేం చేస్తారో.

భారతదేశం ఏర్పడినప్పటి నుండి లౌకిక రాజ్యం గా ఉంటున్నాం, అది అందరూ గౌరవించాలి. ప్రభుత్వం మాదే కదా అని ' రాముడే లేడు ' అనే కాంగ్రెస్ నాయకులకి, నోరుంది కదా అని 'రాముడు పెద్ద తాగుబోతు' అనే కరుణానిధి లాంటి నాయకులకి, మెజారిటీలము కదా అని ' బాబ్రి మసీద్ గతే మీకు పడుతుంది ' అని హెచ్చరించే (సామ్నా పత్రికలో) బాల్ థాకరే లాంటి నాయకులకి ప్రజలు బుద్ది చెప్పాలి.

మన దగ్గరి సమస్యలని కేవలం ప్రాంతీయ సమస్యలు గానే చూస్తుంన్నాము, దేశ సమస్యలు గా చూడటం లేదు. మొన్నటి వరకు కాశ్మీర్ తీవ్రవాదం కేవలం కాశ్మీర్ సమస్యగానే చూసాము, కాని ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతూ ఉండడం వల్ల జాతీయ సమస్య గా పరిణమించింది. మొన్న ముంబయి దాడులు జరిగిన తరువాత రోజే అస్సాం లో రైలు లో బాంబు వల్ల ముగ్గురు చనిపోయారు, ఆ విషయం గురించి పెద్దగా స్పందనే రాలేదు. కాశ్మీర్ తీవ్రవాదం అయినా, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న తీవ్రవాదమైనా, దండాకారణ్యంలో మావోయిస్టులనైనా, దేశ సమస్యకు కారణం ఎవరైనా మనందరం ఒక్కటిగా ఎదురుకోవాలి. జాతీయ సమైక్యతను పెంచాలి.

ఒకవైపు అందరం ఉగ్రవాదాన్ని అణచివేయాలి అని కోరుకుంటూ ఉంటే మరోవైపు మన ప్రియతమ కరుణానిధి గారు LTTE వాళ్ళని రక్షించే పనిలో ఉన్నారు. ఈ విధంగా మనది ద్వంద వైఖరి అని ప్రపంచానికి చాటి చెబుతున్నామన్నమాట. శ్రీలంక ప్రజలు 'వారికి వాళ్ళ సమస్యే తీర్చుకోవడం తెలియదు, మనది తీరుస్తారా' అని నవ్వుకుంటున్నారు. మన నాయకులకు ఎప్పుడు బుద్ది వస్తుందో!!!

కొందరు ముస్లింలకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటం వల్ల అందరు ముస్లింలు ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరింపబడ్డారు. అందువల్ల కొందరు హిందువులు ముస్లింలను స్నేహితులుగా చేసుకోవడం లోను, ఇల్లు అద్దెకు ఇవ్వడం లాంటి విషయాలలోను ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి విషయాలలో మార్పు రావాలి.

ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుడు జరిగినా భారతీయ ముస్లింలు వేధింపులకు గురి అవుతున్నాం అని భాధ పడుతున్నారు. ప్రశ్నించబడేది కేవలం అనుమానితులే, అది కూడా నేర పరిశోధనలో భాగంగానే తప్ప ఇస్లాం మీద ద్వేషం తో కాదని ముస్లింలు గ్రహించాలి. దానికి కారణం కూడా కొందరు భారతీయ ముస్లింలు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడిన సందర్భాలు చాలా బయటపడ్డాయి కాబట్టి.

భారతదేశంలో ముస్లింలకి సరైనా ప్రాతినిధ్యం లేదా, ఆర్ధికంగా వెనక బడ్డారా? అని అడిగితే దానికి సమాధానం అవుననే వస్తుంది. సచార్ రిపోర్ట్ లో మనం పూర్తి గణాంకాలు చూడవచ్చు. ఆ రిపోర్ట్ దాకా ఎందుకు, మనం చదివిన ప్రదేశాలలో, ఉద్యోగం చేసే చోట చూస్తే మనకే తెలుస్తుంది... వారి ప్రాతినిధ్యం ఏంతో. వారి అభివృద్ది కోసం చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. ముస్లింలే కాదు మన దేశంలో కోట్ల మంది హిందువులు కూడా కటిక పేదరికం లో ఉన్నారు. దాదాపు 30% (అంటే ఒక 30 కోట్లనుకోండి !!) మంది దారిద్ర్య రేఖకి దిగువున ఉన్నారు. కాకపోతే రిజర్వేషన్లు మత ప్రాతిపదకన కాకుండా ఆర్థికంగా వెనకబడిన వారికి అందరికి ఇవ్వాలనేదే చాలా మంది కోరిక. దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థ యొక్క అవసరం ఎంతైనా ఉంది. పేదరికంలో మగ్గుతున్న ఎందరో అమాయకులైన ముస్లిం యువకులను తీవ్రవాదులు తమ పావులుగా వాడుకుంటుంన్నారు, ఈ విషయం లో వారిని మరింత విజ్ఞానవంతులను చెయ్యాలి. మన దేశంలో ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.

దేశవిభజన సందర్భంలో అక్షరాస్యులైన, ధనికులైనా ముస్లింలు చాలా మంది పాకిస్థాన్ కి వెళ్ళారు, అందువల్ల ముస్లింలలో పేదవాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాము ( ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ). మైనారిటీలం కాబట్టే మాకు సరైనా అవకాశాలు దొరకడం లేదు అనే భావన చాలా మంది లో ఉంది, కాని అది కేవలం రాజకీయనాయకులు సృష్టి మాత్రమే, రాజకీయాలు, ఆటలు, సినిమాలలో ( చెప్పాలంటే బాలివుడ్ మొత్తం వారిదే) ముస్లింలను ఎంతో మందిని చూడవచ్చు. ఇక అజారుద్దీన్ లాంటి వారు 'మైనారిటీలమనే మా మీద వివక్ష' అని నాటకాలాడటం, మతం అడ్డం పెట్టుకొని MIM వాళ్ళు రౌడీయిజం చేయడం లాంటి వాటి వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. ఈ విషయాన్ని కూడా ముస్లింలు గుర్తించాలి.

అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే ఈ లింక్ దొరికింది. హిందు-ముస్లిం వివాదాలతో పాటు కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విషయాలు అవును కదా అని అనిపించాయి. ఉదాహారణకి, పోలీసులు ఉద్యోగంలో చేరక ముందు నుండి ఉన్న నమ్మకాలని (దేవుడు, మతం....) వారు మార్చుకోరు. అందువల్ల హిందు-ముస్లిం గొడవలు జరిగేప్పుడు పోలీసులు హిందువుల పక్షాన ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో సంస్కరణలు అవసరం. ఇదే ప్రశ్న పోలీసులని అడిగితే గొడవలు జరిగేప్పుడు ఎవరు aggressive గా ఉంటే వారిని control చేయడానికి ప్రయత్నిస్తాం అంటారు.

పరిస్థితులన్ని చక్కబడి అందరూ ఒక కుటుంబంలా ఉండాలని కోరుకుంటూ...
సర్వేజనా సుఖినోభవంతు !!!